కామారెడ్డి, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వికాస్ నగర్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త శాఖను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఎమ్మెస్‌ఎంఈ, మైక్రో యూనిట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్ల దృష్టి పెట్టాలని సూచించారు. వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. బ్యాంకు తన ఖాతాదారులకు ఏటీఎం కం డెబిట్ కార్డ్, సురక్షిత ఇంటర్నెట్ బ్యాంకింగ్ 24/7, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర డిప్యూటీ జోనల్ మేనేజర్ జి. అనంత కుమార్ మాట్లాడారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలను అందిస్తామన్నారు. రాష్ట్రంలో 22 జిల్లాలో బ్యాంకింగ్ లావాదేవీలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎల్‌డిఎం చిందం రమేష్, బ్యాంక్ మేనేజర్ జి.లక్ష్మీకాంత్, బ్యాంకు అధికారులు, ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు.