నిజామాబాద్, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యింది. కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆయన ఛాంబర్‌లో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్వోల సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను డ్రా పద్దతిలో కేటాయింపులు జరిపారు.
జిల్లాలో మొత్తం 245 మంది వీఆర్వోలను 37 శాఖల్లో సర్దుబాటు చేశారు. వ్యవసాయ శాఖలో 10 మంది, పశుసంవర్ధక, డెయిరీ, ఫిషరీస్ లో ముగ్గురికి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ లో ఒకరు, అటవీశాఖలో ఒకరు, సమాచార శాఖలో ముగ్గురు, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 45, ఉన్నత విద్యా శాఖలో 27, హోం శాఖలో 7, ఇండష్టీస్ అండ్ కామర్స్ లో 3, ఇర్రిగేషన్ లో 9, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ 11, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 35, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 61, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 14, సెకండరీ ఎడ్యుకేషన్ 3, ట్రాన్స్పోర్ట్, ఆర్‌అండ్‌బీ 2, ట్రైబల్ వెల్ఫేర్ 1, మహిళా శిశు సంక్షేమ శాఖ 4, యూత్ అడ్వాన్సుమెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ లో ఐదుగురిని డ్రా ద్వారా సర్దుబాటు చేశారు.
వీఆర్వోలు, అసోసియేషన్ బాధ్యుల సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ మొత్తం ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేకుండా వీడియో రికార్డింగ్ మధ్యన జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరిస్తూ, వీ ఆర్ ఓ లను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ లేదా దానికి సమానమైన హోదాలో బదలాయింపు చేయడం జరిగిందన్నారు. సర్వీస్ సంబంధిత అంశాల గురించి వీఆర్వోలు ప్రస్తావించగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమన్ తదితరులు పాల్గొన్నారు.