నిజామాబాద్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో శనివారం ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేస్తూ, కీలక సూచనలు చేశారు.
వజ్రోత్సవ వేడుకల వేళ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో గల సుమారు 3.75 లక్షల నివాస గృహాలకు త్రివర్ణ పతాకాలు పంపిణీ చేయాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో ఈ నెల 8 వ తేదీ నుండి పక్షం రోజుల పాటు చేపట్టనున్న రోజువారీ కార్యక్రమాలను సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేందుకు వీలుగా ఈ నెల 9 నుండి 21 వ తేదీ వరకు అన్ని థియేటర్లలో ‘గాంధీ’ మూవీని స్పెషల్ షోగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి రోజు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రదర్శించబడే గాంధీ మూవీకి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పించాలన్నారు. థియేటర్ల సంఖ్యకు అనుగుణంగా, ఆయా పాఠశాలల వారీగా విద్యార్థులను థియేటర్లలో గాంధీ మూవీని చూపించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్త్వ కార్యాలయాలను, ప్రధాన కూడళ్లను అందంగా ముస్తాబు చేయాలని అన్నారు. వేడుకల్లో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ, ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీవో జయసుధ, ఆర్డీఓ రవి, తెలంగాణ యూనివర్సిటీ పీఆర్‌ఓ త్రివేణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.