కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై శనివారం డిజిపి మహెందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో కలిసి పాల్గొన్నారు.
సి.ఎస్. మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణంలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి (ప్రభుత్వ అండ్ ప్రైవేట్) సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలు, రైతు బంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్‌లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి సినిమా థియేటర్ గాంధీ సినిమా సాటిలైట్ లింక్ రేపటి వరకు డౌన్‌లోడ్ చేసుకోవాలని, దీనిని తహసిల్దార్, ఎస్.హెచ్.ఒ ధృవీకరించాలని, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 12 న ప్రతి సిటీ కేబుల్ ఛానల్‌లో దేశభక్తి పెంపోందించే కార్యక్రమాలు టెలికాస్ట్ చేయాలని, వీటీకి సంబంధించిన లింక్‌లను డిపిఆర్వోల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు.
జిల్లా నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు తరలించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామని, రేపు మధ్యాహ్నం కామారెడ్డి నుంచి వాహనం బయలు దేరుతుందని తెలిపారు.
గాంధీ సినిమా ప్రదర్శన కోసం జిల్లాలో సినిమా థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని, రేపటి వరకు లింక్ డౌన్‌లోడ్ పూర్తవుతుందని తెలిపారు. వజ్రొత్సవ వేడుకలకు సంబంధించి కార్యక్రమాల అమలుకు అందించిన సూచనలు యథావిధిగా పాటిస్తామని తెలిపారు. వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. వీడియో సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ సి.ఈ.ఓ. సాయగౌడ్ డి.ఈ. ఓ. రాజు, డిపిఓ శ్రీనివాసరావు, ఆర్టీవో వాణి, డిఎల్పిఓ. సాయిబాబా, ఇతర జిల్లా అధికారులు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.