వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించిన మంత్రి

నిజామాబాద్‌, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెబ్భై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు మంగళవారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ఘనంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.

జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, రాజ్యసభ సభ్యులు కేఆర్‌.సురేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌, వి.గంగాధర్‌ గౌడ్‌, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వజ్రోత్సవ వేడుకల సంరంభానికి శ్రీకారం చుట్టారు. మూడు రంగుల బెలూన్లను ఎగురవేసి స్వేచ్చా సంకేతం అందించారు. ఉదయం నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా ఆహ్వానితులందరు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాతంత్య్ర వేడుక స్ఫూర్తిని చాటారు. జాతీయతా భావం ఉప్పొంగేలా జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

రంగురంగుల పూలతో, జాతీయ జెండాను తలపించేలా మూడురంగుల బెలూన్లతో అలంకరించిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి గీతాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, భారతావని స్వేచ్చా వాయువులు పీల్చుకుని 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను స్మరించుకునే విధంగా, వారి పోరాట పటిమను గుర్తుచేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించడం అభినందనీయమని అన్నారు.

స్వాతంత్య్ర పోరాటంలో అన్ని ఘట్టాలలో పాలు పంచుకున్న సమరయోధులందరూ స్ఫూర్తి ప్రదాతలని మంత్రి వేముల కొనియాడారు. మహనీయుల వీరోచిత పోరాటం,వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహనీయుల స్ఫూర్తి నేటి తరంలో క్రమేణా సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పక్షం రోజుల పాటు కొనసాగిస్తున్న వజ్రోత్సవ వేడుక కార్యక్రమాలు జాతీయతా స్ఫూర్తిని పెంపొందిస్తాయని మంత్రి వేముల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించాలన్నారు. 75 ఏళ్లలో దేశ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్రం అనేది మూడక్షరాల మాట కాదని, దానిని సాధించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. స్వేచ్ఛ లేకపోతే మనకి ఎన్ని ఉన్నా తృప్తి ఉండదని అన్నారు. దాదాపుగా స్వతంత్ర పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం జరిగిందని అన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో, ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ముందుకు నడిపించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, ప్రజలకు, రైతులకు సాగు ,తాగు నీరు ఇవ్వటంతో పాటు పేద, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించటం నిజమైన స్వాతంత్య్రం అని సీఎం కేసీఆర్‌ చాటి చెప్పారన్నారు. గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా, దేశంలోనే మరెక్కడా లేనివిధంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను తెలంగాణాలో అమలు చేస్తూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు.

ఆయా రంగాల అభివృద్ధి కొలమానంగా కేంద్రం ఎంపిక చేసిన ఆదర్శ గ్రామాల్లో పదికి పది తెలంగాణ రాష్ట్రానికి చెందిన పల్లెలే ఎంపికయ్యాయని, ఇందులో నిజామాబాద్‌ జిల్లా నుండి 4 గ్రామాలు ఉండడం జిల్లాకు గర్వకారణం అన్నారు. ఇదే స్పూర్తితో తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15న 9 గంటలకు ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపై మన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కోరారు. విద్యార్థుల్లో భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని పెంపొందించేందుకు వీలుగా గాంధీ సినిమాను తప్పనిసరిగా చూపించాలన్నారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ, పక్షం రోజుల పాటు కొనసాగే కార్యక్రమాల గురించి, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరించారు. పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడిరచాలని ప్రజలను కోరారు. జిల్లా వ్యాప్తంగా 4 . 51 లక్షల కుటుంబాలకు త్రివర్ణ పతాకాలను పంపిణి చేస్తున్నామని తెలిపారు.

ఈ నెల 12 వ తేదీలోగా పంపిణి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఆకుల లలిత, ఐడీసీఎంఎస్‌ ఛైర్మెన్‌ మోహన్‌, ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు తూము పద్మాశరత్‌, వినీత పండిత్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు సూదం లక్మి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »