కామారెడ్డి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
గాంధీజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలిపారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ భావాన్ని పెంపొందించడానికి 15 రోజులపాటు రాష్ట్రంలో స్వాతంత్ర వజ్రోత్సవాలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. స్వాతంత్య్రం సాధించుకున్న స్ఫూర్తిని ప్రతి వ్యక్తికి తెలియజేయాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని చెప్పారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన తాగినీటిని ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల పాటు నిరంతరం విద్యుత్తును ఇస్తున్నామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు.
గ్రామాల్లో వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేసి పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లోని నిరుపేదలు ఆకలితో అలమటించవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసరా పింఛన్లను అందజేసి వారి ఆకలిని తీరుస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం జరిగిన అభివృద్ధి విషయంలో సర్వే చేపట్టగా తెలంగాణలోని 10 గ్రామాలు అభివృద్ధి చెందిన జాబితాలో ఎంపికయ్యాయని తెలిపారు. ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేసి భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటాలన్నారు. జాతీయ పతకాలను అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలకు అందజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
ఈ నెల 10న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాలు పండగ వాతావరణంలో జరిగే విధంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఈనెల 11న పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో ఫ్రీడం రన్ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 12న స్థానిక టీవీ నెట్వర్క్ ద్వారా దేశభక్తి కార్యక్రమాలను ప్రసారం చేయిస్తామని చెప్పారు.
సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ శోభ, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ హిందూ ప్రియ, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, డిపిఓ శ్రీనివాసరావు, డిఆర్‌డిఓ సాయన్న, జెడ్పి సీఈవో సాయ గౌడ్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.