గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు

వేల్పూర్‌, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలోని ఫ్రీడమ్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి ‘‘ఫ్రీడమ్‌ పార్క్‌’’ లో ఏక కాలంలో 750 మొక్కలు నాటారు.

త్రివర్ణ పతాకాలను చేతబట్టుకుని, దేశభక్తి నినాదాలు ఇస్తూ స్థానికులు ఉత్సాహంగా వనమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరు వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములై దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. ప్రజలందరిలో జాతీయతా భావాన్ని పెంపొందించేలా తెలంగాణా ప్రభుత్వం పక్షం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

ఇందులో భాగంగానే వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవమైన పంద్రాగస్టు రోజున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు కోటీ 20 లక్షల నివాసాలు ఉన్నాయని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అందించేందుకు అనేక మంది త్యాగధనులు కృషి చేశారని, వారి త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు జాతీయత భావాన్ని పెంపొందించుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌, డీఆర్డీఓ చందర్‌, డీపీవో జయసుధ, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »