కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 22న ధరణి టౌన్షిప్‌లో ఉన్న ప్లాట్లు, వివిధ దశలో ఉన్న నిర్మాణాలు, పూర్తయిన ఇండ్లకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ధరణి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్ల, ఇండ్లపై ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఈసారి వేలంలో 20 ప్లాట్లు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లు 175, పూర్తయిన ఇండ్లు 130 వేలం వేస్తామని తెలిపారు. ఆసక్తి గల లబ్ధిదారులు రూ.10,000 చెల్లించి, వేలంలో పాల్గొనవచ్చునని చెప్పారు. వేలంలో పాల్గొనే వ్యక్తి ఈఎండి రూ. 10,000 కలెక్టర్ కామారెడ్డి పేరుపై డిడి రూపంలో చెల్లించవలసి ఉంటుందని సూచించారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు తమ వెంట ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి గుర్తింపు పత్రాలు తీసుకురావాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ధరణి టౌన్షిప్‌లో పెట్టుబడి పెట్టి మీ జీవితానికి రాబడి పొందే వీలుందని చెప్పారు. ప్రధాన రహదారి 44 కు ఆనుకొని ధరణి టౌన్షిప్ ఉందని తెలిపారు. ధరణి టౌన్షిప్ చుట్టూ ప్రహరీ గోడతో సహా లేఅవుట్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ టౌన్ షిప్ ఉందని తెలిపారు.
సమావేశంలో రాజీవ్ స్వగృహ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ డిప్యూటీ జోనల్ మేనేజర్ రాందాస్, ఏవో రవీందర్, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.