నిజామాబాద్, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. నగర నడిబొడ్డున గల అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం ఆరున్నర గంటల సమయానికే వేలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారు.
గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ యువకులు మొదలు వృద్దుల వరకు కదంకదం కలుపుతూ 2 కె రన్ లో పాల్గొనడం జాతీయ సమైక్యతకు అద్దంపట్టింది. జిల్లా యంత్రాంగం వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించి సమకూర్చిన శ్వేతవర్ణపు టీ షర్టులను ధరించి వేలాది మంది ర్యాలీలో పాల్గొనడం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ సమానత్వపు చిహ్నానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, నగర మేయర్ దండు నీతు కిరణ్, అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు తదితరులంతా 2 కె రన్‌లో భాగస్వాములయ్యారు. వీరితో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు, ఏడవ బెటాలియన్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్ స్టూడెంట్లు, క్రీడా సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆర్మీ అధికారులు త్రివర్ణ పతాకాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొని జాతీయ సమైక్యత భావాన్ని చాటిచెప్పారు.
ఫ్రీడమ్ ర్యాలీకి హాజరైన వారితో కలెక్టరేట్ మైదానం కిక్కిరిసిపోయింది. ఎటుచూసినా రెపరేపలాడుతున్న మువ్వన్నెల జెండాలు సగర్వంగా ఎగురుతూ కనువిందు చేశాయి. స్వేచ్చా స్వాతంత్రాలకు సంకేతంగా మూడు రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. స్వాతంత్య్ర ప్రాముఖ్యతను, భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ సాంస్కృతిక కళాకారులు వీనుల విందుగా దేశభక్తి గేయాలు ఆలపించారు.
ఫ్రీడం ర్యాలీని ఉద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జీ కె.సునీత మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ముఖ్యంగా నేటి యువతరం జాతీయ నాయకుల పోరాటాలను గుర్తెరిగి, వారి త్యాగాల ఫలితంగా సిద్ధించిన దేశ స్వాతంత్య్ర ప్రాముఖ్యతను ఇనుమడిరపజేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతావనిలో పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా హక్కులు, బాధ్యతలు కల్పించారని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరు తమ హక్కుల కోసం కృషి చేస్తూనే, బాధ్యతలను కూడా పరిపూర్ణంగా నిర్వర్తించాలని సూచించారు. దేశాభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు కంకణబద్దులై పని చేయాలని ఉద్బోధించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ, పల్లె సీమలే ప్రగతికి పట్టుగొమ్మలు అని జాతిపిత మహాత్మాగాంధీ నమ్మిన సిదాంతానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నారని అన్నారు. నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తికి ఇది అడ్డం పడుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల వల్ల తెలంగాణ అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అంశాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా నిర్వించిన సర్వేలో తెలంగాణలోని గ్రామాలే ఉత్తమ గ్రామాలుగా నిలిచాయని గుర్తు చేశారు.
కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవాలు ప్రతి భారతీయుడికి పండగ లాంటివని పేర్కొన్నారు. త్యాగధనుల పోరాటాలతో స్వేచ్ఛను సాధించుకున్న భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తూ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుతోందన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి విరుగుడుగా భారతదేశమే వాక్సిన్ ను తయారుచేసి ప్రపంచ దేశాఖలు అందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భిన్న భాషలు, మతాలు, సంస్కృతులతో కూడి ఉన్నప్పటికీ, ఎలాంటి ఆపద వచ్చినా మేమంతా ఒక్కటే అని భారతీయులు సగర్వంగా చాటిచెప్పేలా ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారని హర్షం వెలిబుచ్చారు. రక్త సంబంధం అని చూడకుండా ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే తత్వం ఒక్క భారతీయులకే సొంతమని అన్నారు. ఇదే స్పూర్తితో ఈ నెల 22 వరకు కొనసాగే వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములవుతూ విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
దేశం నాకు ఏమిచ్చింది అని కాకుండా.. దేశానికి నేను ఏమిచ్చాను అనే భావనతో ప్రతి ఒక్కరు ముందుకు సాగుతూ దేశ ప్రగతికి పాటుపడాలని కోరారు. ఆహుతులను ఉద్దేశించి అతిథులు ప్రసంగించిన మీదట జాతీయ గీతాలాపనతో ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని ముగించారు.