కామారెడ్డి, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఫ్రీడం రన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. బస్టాండు నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు రెండున్నర కిలోమీటర్ల దూరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చే క్రమంలో ఎంతోమంది అమరులయ్యారని వీరందరిని గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఫ్రీడమ్ రన్‌కు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, యువకులు, పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు.
జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఫ్రీడం రన్ దోహదపడుతుందని చెప్పారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాల విద్యార్థులకు గాంధీ చిత్రాన్ని ఉచితంగా సినిమా థియేటర్లలో చూపించే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. త్యాగం, శాంతి, అభివృద్ధి వంటి అంశాలను జాతీయ జెండా తెలియజేస్తుందని చెప్పారు.
జాతీయ భావం, ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా ప్రజలు అన్ని రకాలుగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఫ్రీడమ్ రన్ కు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తిలో జాతీయ భావం పెంచాలని లక్ష్యంతో ఈ నెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూ ప్రియ,ఏఎస్పీ అన్యోన్య, లీడ్ బ్యాంకు మేనేజర్ చిందం రమేష్, సిపిఓ రాజారామ్, డిఆర్డిఓ సాయన్న, జెడ్పి సీఈవో సాయా గౌడ్, డీఎస్పీ సోమనాథం, జిల్లా యువజన సర్వీసులు, క్రీడల సంక్షేమ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవనాధికారి సంజీవరావు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.