నిజామాబాద్, ఆగస్టు 14 :
భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేడ్కర్ భవన్లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కళాకారులు ముఖ్య అతిథులను కళారీతులతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
చిందు, యక్షగానం, నాటిక, దేశ భక్తి గేయాలతో కళాకారులు అలరింపజేశారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిఫలింపజేస్తూ, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను కళ్లకు కట్టినట్టు కళాకారులు తమ అభినయ కౌశలాన్ని ప్రదర్శించారు. వారి కళా నైపుణ్యాన్ని ఆద్యంతం వీక్షించిన ముఖ్య అతిథులంతా ప్రశంసించారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన బాబన్న బృందం ప్రదర్శించిన చిందు జానపద యక్షగానం అంతరిస్తున్న కళా సంస్కృతికి జీవం పోసింది. పోలీసు కళాజాత బృదం సభ్యురాలు సీత ఆలపించిన ‘‘ పుణ్య భూమి నా దేశం’’ దేశ భక్తి గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.
గోదావరి బృందంతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం సభ్యులు సైతం ఆలపించిన గేయాలు, నృత్యాలు స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను కళ్ల ముందు కదలాడేలా చేశాయి. సర్వ మతాలు సమానమే భావనను పెంపొందించేలా సాంస్కృతిక కళా సారధి జిల్లా సమన్వయకర్త ఆష్ట గంగాధర్ బృందం ప్రదర్శించిన మూకాభినయం అందరినీ ఆలోచింపజేసింది. జిల్లా కేంద్రంలోని నేషనల్ హై స్కూల్ (ఉర్దూ)కు చెందిన పదవ తరగతి విద్యార్థినులు మహెవీష్ తబస్సుమ్, రొఖియా తబస్సుమ్‌లు ‘‘సారే జహాన్ సే అచ్చా‘‘ గేయాన్ని లయబద్దంగా ఆలపించి మన్ననలు అందుకున్నారు.
చివరగా ఆష్ట గంగాధర్ పిట్టల దొర నాటిక కడుపుబ్బా నవ్వించింది. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన జానపద ప్రదర్శనలు భారతీయ కళా వైభవాన్ని చాటాయి. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్, నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ, కనుమరుగవుతున్న చిందు, యక్షగానం వంటి కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిని గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం కళాకారులను సముచితంగా గౌరవిస్తూ వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో కూడా జానపద కళా ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కళాకారులకు అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర అనిర్వచనీయమని, సమాజాన్ని చైతన్యపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిఫలింపజేస్తున్న కళాకారులను అన్ని వర్గాల వారు ఆదరించాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని చాటేలా కళాకారులు ఆకట్టుకునే రీతిలో ప్రదర్శనలు చేశారని ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందించారు. ప్రజల్లో జాతీయతా భావాన్ని, దేశం పట్ల ప్రేమను పెంపొందించేందుకు కళా రూపాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఆంగ్లేయుల దాస్య శృంఖలాల్లో బందీగా మారిన భారతమాతకు విముక్తి కల్పించేందుకు ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తూ ఉన్నతమైన జీవితాన్ని వెళ్లదీస్తున్నామని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ దేశాభ్యున్నతికి పాటుపడాల్సిన గురుతర బాధ్యతను ప్రతి ఒక్కరు నిర్వర్తించాలన్నారు. ఈ కోవలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవ కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొంటూ జాతీయ స్ఫూర్తిని చాటుతున్నారని కలెక్టర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరహా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడిరచాలని, 16 వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వారక్కడ తప్పనిసరిగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం, మెప్మా పీ.డి రాములు, జిల్లా ఉర్దూ విభాగం అధికారి మొహమ్మద్ అర్షద్, పెద్ద సంఖ్యలో కళాభిమానులు, మహిళలు పాల్గొన్నారు.