డిచ్పల్లి, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి రాజు గంధంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఉదయం కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌లో నిర్వహించారు.
బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ వి. రాజేశ్వర్ పర్యవేక్షణలో ‘‘ఇన్వెస్టర్ బిహేవియర్ టువార్డ్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ – ఎ స్టడీ ఇన్ హనుమకొండ’’ అనే అంశంపై పిహెచ్. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి టీయూకు సమర్పించారు. వైవా – వోస్ కు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ స్టుడెంట్ అఫైర్స్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ స్టుడియోకు చెందిన డా. ఎన్. ఉదయ భాస్కర్ విచ్చేసి సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
వైవా – వోస్‌కు చైర్మన్‌గా బిజినెస్ మేనేజ్ మెంట్ ఫ్యాకల్టీ పీఠాధిపతి ప్రొఫెసర్ కైసర్ మహ్మద్, కన్వీనర్‌గా బిఒఎస్ డా. జి. వాణి వ్యవహరించారు. విభాగాధిపతి డా. కె. అపర్ణ, డా. ఆంజనేయులు తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజు గంధం డాక్టరేట్ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్.ఆరతి, కంట్రోలర్ ఆచార్య ఎం.అరుణ, పీఆర్ఓ డా. వి. త్రివేణి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.