రక్తదాన శిబిరాలకు వెల్లువెత్తిన స్పందన

నిజామాబాద్‌, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ యంత్రాంగం పిలుపునందుకుని రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని చాటారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేసేందుకు ఆసక్తి చూపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బందితో పాటు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది దాతల నుండి రక్తం సేకరిస్తూ, ఆయా రక్తనిధి కేంద్రాలకు తరలించారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాల భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నగర మేయర్‌ నీతూకిరణ్‌, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 750 మంది దాతల వరకు రక్తదానం చేశారు. దాతలను ముఖ్య అతిథులు అభినందిస్తూ ప్రశంసాపత్రాలు బహూకరించారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, సాధారణ సమయాల్లో సైతం రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని, ప్రత్యేకించి యువత చొరవ చూపాలని సూచించారు. రక్తాన్ని దానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. థలసేమియాతో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, ప్రసవాల సమయంలో గర్భిణీలకు, శస్త్ర చికిత్సలు జరిపే సమయాల్లో రక్త హీనత ఏర్పడిన వారికి దాతలు అందించే రక్తమే ప్రాణాలు నిలుపడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.

రక్తం ఇవ్వడం వల్ల దాతలకు కూడా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. దీనిని గమనించి రక్తదానం పట్ల అనవసర అపోహలను విడనాడి అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణ విధులకే పరిమితం కాకుండా సమాజం పట్ల కూడా తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ సేవా దృక్పధాన్ని చాటుకుంటున్నారని అన్నారు.

పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు మాట్లాడుతూ, రక్తానికి హిందూ, ముస్లిం, కుల, మతాలు అనే తేడా లేదని, మనమంతా ఒక్కటే అనే సంకేతానికి చిహ్నంగా అందరి రక్తం ఎరుపు రంగులోనే ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వారి ప్రాణాలు నిలిపేందుకు ఎంతగానో దోహదపడే రక్తాన్ని దానం చేసేందుకు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

దీని ప్రాముఖ్యతను గుర్తెరిగి వజ్రోత్సవ వేడుకల వేళ పెద్ద ఎత్తున్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. వజ్రోత్సవ సంబరాల్లో పెద్ద ఎత్తున్న భాగస్వాములవుతున్న తమ పోలీసు శాఖ సిబ్బంది, అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ అధిక సంఖ్యలో రక్తదానం చేయడం ఎంతో సంతృప్తి కలిగించిందని సీ.పీ నాగరాజు హర్షం వెలిబుచ్చారు.

కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, డాక్టర్‌ ఫరీదా బేగం, టీబీ నియంత్రణ విభాగం సమన్వయకర్త రవి, డీఎస్‌ఓ చంద్రప్రకాష్‌, ఏసీపీలు వెంకటేశ్వర్‌, గిరిరాజ్‌, మెడికల్‌ ఆఫీసర్లు ఆతిఫుద్దీన్‌, సరితా, రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌, టీఎన్‌జీఓ సంఘం బాధ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »