కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయడానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం పిఆర్టియు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఏర్పాటు చేసిందని తెలిపారు. పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు.
ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షం రోజులపాటు దేశం గర్వించే విధంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఫ్రీడమ్ ర్యాలీని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై ప్రారంభించారు. నిజాంసాగర్ చౌరస్తా మీదిగా స్టేషన్ రోడ్, పాత బస్టాండ్, అడ్లూరు రోడ్డు మీదిగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.
వెయ్యి అడుగుల జాతీయ పతకాన్ని ఉపాధ్యాయులు ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందు ప్రియా, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుశాల్, సదాశివ నగర్ మండల అధ్యక్షుడు గాదరి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రతినిధులు జమీల్ అహ్మద్, బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.