కామారెడ్డి, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
విద్యుత్తు చౌర్యానికి పాల్పడవద్దని సూచించారు. మండపాల నిర్వాహకులు డీడీలు చెల్లించి విద్యుత్ సౌకర్యం పొందాలని పేర్కొన్నారు. మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులు రోడ్లను బాగు చేయాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్ర రోజు విద్యుత్తు అంతరాయం కలగకుండా ట్రాన్స్కో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణపతి మండపాలలో విగ్రహాలను ప్రతిష్టించే యువజన సంఘాలు, నిర్వాహకులు ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్ర రోజు శాంతి కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషించాలని కోరారు. వినాయక చవితి వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా చూడాలన్నారు.డీజే లకు అనుమతి లేదని చెప్పారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.