నిజామాబాద్, ఆగష్టు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని (న్యూ కలెక్టరేట్)ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సెప్టెంబర్ 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూ కలెక్టరేట్ కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిల్లో ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ప్రధానంగా సుందరీకరణ, లైటింగ్ పనుల పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. కలెక్టర్ భవన సముదాయాన్ని నిశితంగా పరిశీలన జరిపారు. న్యూ కలెక్టరేట్ ఆవరణతో పాటు, కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కనీసం ఐదు రోజుల ముందే ఈ నెలాఖరులోగా న్యూ కలెక్టరేట్ ను అన్ని హంగులు, సదుపాయాలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు.
కలెక్టరేట్ పరిసరాలన్నీ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలని, ఎక్కడైనా మొక్కలు చెడిపోతే యుద్ధ ప్రాతిపదికన వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని ఆదేశించారు. మెయిన్ గేట్ నుండి లోనికి వచ్చే మార్గంలో మరింత అందంగా, పూల మొక్కలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని వసతులు అందుబాటులోకి వచ్చేలా యుద్దప్రాతిపదికన పనులను పూర్తి చేయించాలన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.