ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నాగిరెడ్డిపేట మండలం పల్లె బొగుడ తాండ గ్రామానికి చెందిన టిఆర్ఎస్, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తప్ప నిరుపేదలకు న్యాయం జరగదని అదేవిధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.
అదేవిధంగా అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో గెలిచి కోట్ల రూపాయలకు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన నల్లమడుగు సురేందర్ ఆయన ఆస్తులు పెంచుకుంటున్నాడు తప్ప నియోజకవర్గ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజులలో ఎల్లారెడ్డి నియోజకవర్గ గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కష్ట కాలంలో పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందన్నారు.
కార్యక్రమంలో ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు ఆఫీస్ పటేల్, మాజీ ఎంపిటిసి గోవింద నాయక్, ఉప సర్పంచ్ గోపియా నాయక్, విట్టల్ నాయక్, మండల నాయకులు బాబురావు, నారాయణరెడ్డి, సాయిలు, లింగంపేట్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు, సీనియర్ నాయకులు రాములు, బొల్లారం గ్రామానికి చెందిన నాయకులు సాయిలు, డ్యానబోయిన సాయిలు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.