నిజామాబాద్, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువులు సమాజ దిశా నిర్దేశకులని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. విద్యతోనే సమాజం సత్వర అభివృద్ధి సాధిస్తుందని, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ అన్ని వర్గాల వారికి ఉచితంగా నాణ్యమైన విద్య అందేలా వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని గుర్తు చేశారు.
ఆయా వర్గాల వారి కోసం అన్ని వసతులతో కూడిన గురుకులాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ తరహా హంగులు సమకూరేలా మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోధిస్తూ గురువు స్థానానికి మరింత వన్నె తేవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు.