శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్‌ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలతో కలిసి కలెక్టర్‌ బుధవారం వినాయక శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.

జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, అక్కడి నుండి మొదలుకుని గుర్బాబాదీ రోడ్‌, లలితమహల్‌ థియేటర్‌, గంజ్‌, గాంధీచౌక్‌, పవన్‌ థియేటర్‌, ఖిల్లా రోడ్‌, బర్కత్‌ పురా, గురుద్వారా, పెద్దబజార్‌, కోటగల్లి, గోల్‌ హనుమాన్‌, ఫులాంగ్‌ చౌరస్తా, వినాయకనగర్‌ మీదుగా గణేశుల బావి వరకు రూట్‌ మ్యాప్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే మార్గమైన అర్సపల్లి, సారంగాపూర్‌, జానకంపేట్‌, నవీపేట్‌, యంచ గ్రామాల మీదుగా బాసర బ్రిడ్జి వరకు గల మార్గాన్ని పరిశీలన జరిపారు.

ఈ సందర్భంగా అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలను పైకి భిగించాలని సూచించారు. కాగా, జానకంపేట్‌ రైల్వే క్రాసింగ్‌ మీదుగా ఎనిమిది అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా జన్నపల్లి రోడ్డును పరిశీలించారు.

జన్నెపల్లి రోడ్డులోనూ రైల్వే గేట్‌ వద్ద నుండి భారీ విగ్రహాలు ముందుకెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో, కాలూర్‌, ఖానాపూర్‌ మార్గాన్ని పరిశీలించారు. బాసర వద్ద గోదావరిలో భారీ విగ్రహాల నిమజ్జనం కోసం ఐదు క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని సూచించారు. వినాయకుల బావిని నిండుగా నీటితో నింపాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.

సార్వజనిక్‌ గణేష్‌ మండలి ప్రతినిధులు, వినాయక మంటపాల నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ, వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కల్పిస్తామని అన్నారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని హితవు పలికారు. ప్రధానంగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహంతో జరుపుకునే పండుగ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుని ఏ ఒక్క కుటుంబానికి కూడా శోకం మిగిలే పరిస్థితి తలెత్తకుండా భద్రతా పరమైన చర్యలను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులు సూచించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని కలెక్టర్‌ కోరారు.

పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు మాట్లాడుతూ, నిమజ్జనోత్సవం సందర్భంగా కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. పౌరుల రక్షణే తమ ప్రధాన కర్తవ్యంగా విధులు నిర్వర్తిస్తున్నామని, నిజామాబాద్‌ జిల్లాకు ఉన్న మంచి పేరును మరింతగా ఇనుమడిరపజేసేలా ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర జరుపుకోవాలని, అన్ని వర్గాల వారు పోలీస్‌ యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. వీరి వెంట నిజామాబాద్‌ ఆర్డీఓ రవి, ఏసీపీ ఏ.వెంకటేశ్వర్‌, సార్వజనిక్‌ గణేష్‌ మండలి ప్రతినిధులు బంటు గణేష్‌, పీ.శ్రీనివాస్‌, శివకుమార్‌, ట్రాన్స్‌ కో, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »