తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 16 నుండి మూడు రోజుల పాటు ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజుతో కలిసి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వజ్రోత్సవ వేడుకలు, వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14 నుండి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు, ఇతర ప్రముఖ వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్‌ సంస్థల సముదాయాలను మూడు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించేలా చూడాలన్నారు. ముఖ్యంగా 16 వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కనీసం 15 వేల మందికి తగ్గకుండా, జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ సంబంధిత శాసన సభ్యుల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించాలని సూచించారు.

ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మున్సిపల్‌ వార్డు నుండి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభకు, భోజన వసతి కోసం ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించిన తరహాలోనే ఈ వేడుకను కూడా ఘనంగా జరిపించాలని, జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలని కలెక్టర్‌ సూచించారు. ప్రధానంగా పోలీస్‌ శాఖ క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.

17 వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం వేళలో జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. అదేరోజున గిరిజన తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ వర్గాల వారిని సుమారు 1300 మందిని హైదరాబాద్‌ కు ప్రత్యేక వాహనాల్లో తరలించాలని, అల్పాహారం, భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

18 వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని, స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ వేడుకల్లో పాఠశాలలను మినహాయిస్తూ ఇంటర్‌, డిగ్రీ, తదితర కళాశాల స్థాయి విద్యార్థులను మాత్రమే భాగస్వాములు చేయాలని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయము పెంపొందించుకుని సమిష్టి కృషితో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.

నిమజ్జనోత్సవంలో ప్రమాదాలకు తావుండకూడదు
వినాయక నిమజ్జనోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. నిమజ్జనోత్సవంలో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతాల్లోనూ ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, నీటిలో గల్లంతు కావడం వంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నిమజ్జనోత్సవం చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా గజఈతగాళ్ళు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని, వారి ద్వారానే విగ్రహాలను నిమజ్జనం చేయించాలని, ఇతరులెవరినీ చెరువులు, కుంటలు, నదుల్లో దిగేందుకు అనుమతించకూడదని జాగ్రత్తలు సూచించారు. నిర్ణయించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం జరిపేలా, నిర్ణీత మార్గాల మీదుగా నిమజ్జన శోభాయాత్ర కొనసాగేలా ప్రణాళికలు రూపొందించుకుని పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలన్నారు.

నిమజ్జనోత్సవానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలూ కల్పించాలని, సానిటేషన్‌ తో పాటు తాగునీరు, నిమజ్జన ప్రదేశంలో క్రేన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒడిదుడుకులకు తావులేకుండా ఆనందోత్సాహాలతో సజావుగా నిమజ్జనోత్సవం జరిగేలా కృషి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, డీపీఓ జయసుధ, డీసీఓ సింహాచలంతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Check Also

న్యాయవాదిపై దాడి ఖండిరచిన బార్‌ అసోసియేషన్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »