నిజామాబాద్, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా వినాయకనగర్ హనుమాన్ జంక్షన్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఇందుకు ఐలమ్మ చరిత్రే నిదర్శనమన్నారు.
ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించు కోవాలని బిసి సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. నాడు దేశ్ముఖ్‌లను, రజాకార్లకు పరిగెత్తించిన ఐలమ్మ యొక్క తెగింపును వారసత్వంగా బీసీలు ఎంచుకుని ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఒక్క వీరనారి కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలకు చెందే విధంగా చూడడం ఒక గొప్ప విషయం, తన నాలుగు ఎకరాల భూమిని కాపాడుకోవడమే కాకుండా వేల మందికి భూమి చెందే విధంగా చూసిన నాయకురాలు గొప్ప ధీశాలి చాకలి ఐలమ్మ.
ఆమె చివరి శ్వాస వరకు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు శ్రమించింది, ఆమె బాటలో పయనించి బీసీలు తమ హక్కులను సాధించుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, మాడవేడి వినోద్ కుమార్, సాయిలు, నగేష్, అనిల్, రవి, ప్రదీప్, రమణ తదితరులు పాల్గొన్నారు.