నిజామాబాద్, సెప్టెంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన ప్రాధాన్యతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు కొనసాగే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు సమగ్ర ప్రణాళికతో సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. 16న శాసనసభ నియోజకవర్గాల వారీగా 15వేల మందితో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ జరపాలని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల వారిని ప్రతి గ్రామపంచాయతీ వారీగా భాగస్వామ్యం అయ్యేలా చూడాలని అన్నారు.
ఆయా గ్రామాల నుండి ర్యాలీలో పాల్గొనే వారిని తరలించేందుకు పక్కా ప్రణాళికతో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ర్యాలీ, సభ అనంతరం భోజన వసతి కల్పించాలని కలెక్టర్ సూచించారు. వాహనాలను సమకూర్చే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
రుచికరమైన, పరిశుభ్రతతో కూడిన భోజన వసతి కల్పించేలా చూడాలన్నారు. 17వ తేదీన జిల్లా నుండి సుమారు 3500 మంది షెడ్యూలు తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను హైదరాబాద్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 18న సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీటీసీ వెంకటరమణ, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.