గాంధారి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి పరుగులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛనులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. అదేవిదంగా దుర్గం క్లస్టర్లో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మండలంలోని నేరల్, నేరల్ తాండా, చద్మల్, చద్మల్ తాండా గ్రామాలతో పాటు దుర్గం క్లస్టర్ లోని మిగతా గ్రామాలలో గల లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులను అందజేశారు.
దుర్గంలో రైతు వేదిక ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో తెలంగాణలో ఎప్పుడులేని అభివృద్ధిని తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపిస్తున్నారని అయన అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు. దేశంలో ఎక్కడా అమలుకాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. రైతును రాజుగా చూడాలనేదే కెసిఆర్ కోరిక అని, దానిని సాకారం చేయడానికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు.
రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని అన్నారు. పంట పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి ఎకరాకు 10 వేలు అందిస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. ఉచిత విద్యుత్ పథకం దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు ఇవ్వడం లేదని గుర్తుచేశారు. రైతు భీమా ద్వారా అనుకోకుండా రైతు మరణిస్తే 5 లక్షలు రైతు కుటుంబ సభ్యులకు అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో కూడా 9 గంటల బిల్లుతో కూడిన విద్యుత్ అందిస్తున్నారని అన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా సకాలంలో కొరత లేకుండా ఎరువులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహార అందిస్తున్నామని, ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయల కెసిఆర్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష నూటపదహారు రూపాయలు ఇస్తున్నది ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కడే అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు అనవసర రాద్ధాతం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశంలో అధికారం చేపట్టిన అభివృద్ధి శూన్యంగా ఉందని అన్నారు. తెలంగాణలో రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో కూడా రైతులకు అందజేయాలని కెసిఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇటీవల దేశంలోని 24 రాష్ట్రాల రైతు సంఘ నాయకులు హైదరాబాద్‌లో కెసిఆర్‌తో సమావేశం అయ్యారని, దేశానికి కెసిఆర్‌లాంటి రైతు నాయకుడు కావాలని రైతు సంఘాలు కోరిన విషయాన్నీ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
కెసిఆర్ నాయకత్వంలో దేశంలోని ప్రతి రైతుకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చని తెలిపారు. బీజేపీ తెలంగాణలో మతవిద్వేషాలు సృష్టించాలని చూస్తుందని అన్నారు. ఎన్నికలు రాగానే మతం, కులం, దేవుని పేరుతో రాజకీయం చేయాలనీ బీజేపీ చూస్తుందని అన్నారు.తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని విపక్షాల కళ్ళబోల్లి మాటలకు తగిన బుద్ది చెబుతారని అన్నారు.
పేద ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలను ఆపాలని బీజేపీ చూస్తుందని అన్నారు. పేదలకు అందిస్తున్న ఆసరా పింఛను ఉచిత పథకమా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న వనరులను అమ్ముకుంటూ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబేడుతుందని అన్నారు. నల్ల ధనాన్ని వెలికి తీసి పేదల అకౌంట్‌లలో 15 లక్షలు వేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బడా బాబులకు 12 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం పేదలకు అందించే పింఛను ఆపాలని చూస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా 2016 రూపాయల ఆసరా పింఛను ఇస్తున్నది కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాలలో నెలకొన్న పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం జిఓ విడుదల చేసిందని, త్వరలోనే పోడు భూముల సమస్యలు పరిష్కరించాబడతాయని అన్నారు.
పోడు భూములు కల్గిన రైతులకు పట్టాలు ఇస్తామని అన్నారు.అనంతరం నూతనంగా మంజురైనా పింఛను గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సురేందర్ స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, ఏఎంసి చైర్మన్ సత్యం పటేల్, సొసైటీ చైర్మన్ సాయి కుమార్, సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షుడు సంజీవ్ యాదవ్, వైస్ ఎంపీపీ భజన్ లాల్, వైస్ ఏఎంసి చైర్మన్ రెడ్డి రాజులు, తెరాస నాయకులు ముకుంద్ రావు, శివాజీ రావు, ఎంపీడీఓ సతీష్, తహసీల్దార్ గోవర్ధన్, ఏడి రత్న, ఏఓ నరేష్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.