రాచరిక వ్యవస్థ నుండి ప్రజా స్వామ్య వ్యవస్థలోకి మారిన శుభదినం

బాల్కొండ, సెప్టెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసిఆర్‌ పిలుపు మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ‘‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో’’ భాగంగా మొదటి రోజైన శుక్రవారం బాల్కొండలో ‘‘తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ’’ ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేలాది మంది ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి పాటలతో, మువ్వన్నెల జెండా చేతబూని విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పొంగిన దేశభక్తితో సభా ప్రాంగణం వరకు ర్యాలీగా తరలివచ్చారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మనమంతా భారతీయులమని లోకానికి వెలుగేత్తి చాటేలా భారీగా తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాజకీయ సభలు వేరు, ఇవాళ్టి సభ వేరు మనమందరం ఒకటే అని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చాటి చెప్పారు. మీరు చూపించిన అభిమానానికి రుణపడి ఉంటా. తారతమ్యాలు తరువాయి.. మొదలు మనం భారతీయులం అనే స్ఫూర్తిని తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీతో చాటారు.

రాచరిక వ్యవస్థ నుండి ప్రజా స్వామ్యం లోకి మారిన శుభ దినం సెప్టెంబర్‌ 17.సువిశాల భారత్‌లోకి మారి 75 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే మూడు రోజుల పాటు వజ్రోత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆయన పిలుపు మేరకు ప్రజలంతా ఐక్యంగా కదిలి వచ్చారు. మూడు రోజుల పాటు పండగ వాతావరణంలో వేడుకలు జరుగుతాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల అవుతున్న,గత అరవై ఏళ్లు మనం పోరాటంలోనే గడిపాము. తెలంగాణ కోసం జండా పట్టి పోరాడిన వ్యక్తి సీఎం కేసీఆర్‌. ప్రతి గడపకు స్వాతంత్ర ఫలాలు అందాలనే ఉద్దేశంతో పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించారు.

ఆంధ్ర పాలనలో మన నీళ్ళు, నిధులు, నియామకాలు కోల్పోయాము. అందుకే కేసీఆర్‌ పోరు బాటను ఎంచుకున్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అందరం పాల్గొన్నాం. చివరికి చావునొట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌. డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్‌ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఆయన స్పూర్తితో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టుకోవడం గర్వకారణం. తెచ్చుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో నేడు అభివృద్దిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి అన్నారు.

తెలంగాణ అభివృద్ది ఓర్వలేక కుట్రతో కొంత మంది సోషల్‌ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. నేను అబద్దం మాట్లాడను మాట్లాడినట్లైతే నా మంత్రి పదవి కి రాజీనామా చేయడానికి సిద్ధం. 50 ఏళ్ల సమైక్య పాలనలో పేదలకు అన్యాయం జరిగింది. కానీ ఈ 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం జరిగింది. కేసిఆర్‌ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్దిపై ప్రజలు, రైతులు ఆలోచన చేయాలి. రెచ్చగొట్టే వారి మైకంలో పడితే గోస పడతాం. కేసీఆర్‌ పాలనలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

గతంలో పెన్షన్ల కోసం అప్పటి ప్రభుత్వాలు 28 లక్షల మందికి 800 కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు 48 లక్షల మందికి 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత పాలకులు ఇచ్చిన పెన్షన్ల కంటే 10 రెట్లు ఎక్కువ మందికి పెన్షన్‌లు ఇస్తున్నాం. కేసీఆర్‌ కంటే ముందు ఆడబిడ్డ పెళ్ళయితే ఎవరైనా లక్ష రూపాలు ఇచ్చారా..?? కేసీఆర్‌ కిట్టును సీఎం రూపకల్పన చేసినపుడు నాకళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక ఆడబిడ్డ కోసం కేసీఆర్‌ పడ్డ తపన కళ్ళారా చూసాను. ప్రసవం తర్వాత తల్లి బిడ్డ ల సంక్షేమం కోసం 13 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న మాట వాస్తవం కాదా??. బాగా మాట్లాడుతున్న బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకం ఎందుకు అమలు చేయడం లేదు.? ప్రజలు వీటిపై ఆలోచన చేయాలి.

పేద విద్యార్థుల సంక్షేమం కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పి, పౌష్ఠికాహారం పెడుతూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మన కళ్ళ ముందే కన్పిస్తున్నాయి. కానీ పువ్వు గుర్తు బీజేపీ ఉన్న గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో, చేతి గుర్తు కాంగ్రెస్‌ పార్టీ ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవు. వాళ్ళు అధికారంలోకి వస్తె అలాంటి పరిస్థితే తెలంగాణకు వస్తది. మనకు అది కావల్నా ప్రజలు ఆలోచన చేయాలి.

రైతులు గత పాలకుల కాలంలో పడ్డ కష్టాలు మర్చిపోదామా. రోజుకు రెండు మూడు గంటల కరెంట్‌ మనకు కావల్నా.. అలాంటి రోజులు మళ్లీ రావల్నా..? లో ఓల్టేజ్‌, ఎరువుల సమస్యలు మళ్లీ రావాలా..? రైతులు ఆలోచన చేయాలి.

కాళేశ్వరం నుండి నీటిని పైకి తెచ్చి వరద కాలువను,కాకతీయ కాలువను నిండుగా ఉంచుతున్నం వాస్తవం కాదా?? ఇది నిజమైన స్వాతంత్రము కాదా..? పక్క రాష్ట్రాలు పోతే అక్కడి రైతులు పడే కష్టాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. వ్యవసాయానికి దూరం కావాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎకరానికి 10 వేల పెట్టుబడి దేశంలో ఎక్కడ ఇస్తలేరు. రాష్ట్రంలోని పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి కి మీరే సాక్షం కాదా..? కేసీఆర్‌ సంకల్పం వల్ల 6 శాతం పచ్చదనం పెరిగింది. ఇది ఓట్ల కోసం చేయలేదు కేసీఆర్‌, భావి తరాల కోసం చేశారు ఇది గమనించాలి.

18 రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు జరుగుత లేవో ఆలోచన చేయాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడిపే బిజెపి కి నిజంగా రాముని పై భక్తి ఉంటే మన నియోజక వర్గానికి ఎన్ని గుళ్ళు తెచ్చారో సమాధానం చెప్పాలి. కేసీఆర్‌ ఆలోచన ఒక్కటే రాష్ట్రం సంపద పెరగాలి, అది ప్రజలకు పంచి పెట్టాలి. అపుడే మనం తెచ్చుకున్న స్వత్యంత్రానికి అర్థం ఉంటది. మనందరం భారతీయత స్ఫూర్తిని నింపుకొని ముందుకెల్దాం. మనందరికీ కేసిఆర్‌ నాయకత్వమే శ్రీరామ రక్ష.’’ అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

జైహింద్‌…జై తెలంగాణ…జై భారత్‌ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సి రాజేశ్వర్‌ రావు, నిజామాబాద్‌ సిపి నాగరాజు, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, రైతు నాయకుడు నర్సింహానాయుడు, డాక్టర్‌ మధు శేఖర్‌, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »