నిజామాబాద్, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. వజ్రోత్సవాల ప్రారంభోత్సవ సూచికగా జరుపుకుంటున్న వేడుకలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీ.గంగాధర్ గౌడ్, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, తదితరులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి వేముల, పుర ప్రముఖులను, అధికార అనధికారులకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపారు. ఈ వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరింపజేశాయి. ఈ సందర్భంగా చిన్నారులను మంత్రితో పాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.