నిజామాబాద్, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వబ్రాహ్మణ కులస్థుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతూ, వారి అభ్యున్నతికై జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సి.నారాయణరెడ్డికి విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పలు సమస్యలను నివేదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఇటీవలి కాలం వరకు కూడా గ్రామాల్లో ప్రతి శుభప్రదమైన పని కోసం ప్రజలు విశ్వబ్రాహ్మణులపైనే ఆధారపడేవారని, పల్లెల్లో వారికి ఎంతో ప్రాధాన్యత ఉండేదన్నారు.
విశ్వబ్రాహ్మణులు అంటేనే మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అనే గౌరవభావం ఇప్పటికీ ప్రజల్లో నెలకొని ఉందన్నారు. అయితే మారుతున్న కాలానుగుణంగా సమాజంలో ఆధునిక పోకడలు సంతరించుకుని పారిశ్రామికత పల్లెల వరకు విస్తరించడంతో విశ్వకర్మలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన మాట వాస్తవమేనని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అన్ని చేతి వృత్తుల వారు, ఇతర అన్ని రంగాల వారు కూడా ఎదుర్కోకతప్పడం లేదని గుర్తు చేశారు.
దీనిని అధిగమించేందుకు వీలుగా మారిన పరిస్థితులకు తగినట్టుగా మనకుమానం మార్పు చెందాల్సిన అవసరం ఉందని, ఆధునికత దిశగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. అప్పుడే ఆశించిన స్థాయిలో అభివృద్ధి, గుర్తింపు దక్కుతాయన్నారు. విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా, వచ్చే సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పరిపూర్ణాచారి, రామ్మోహనాచారి తదితరులు పాల్గొన్నారు.