నిజామాబాద్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధూం.. దాంగా సాగాయి. కళాకారులు, చిన్నారుల ప్రదర్శనలను ఆద్యంతం తిలకించిన ముఖ్య అతిథులు, ఆహుతులు కరతాళధ్వనులతో అభినందించారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయగా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు ముఖ్య అతిథులను కళారీతులతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
చిందు యక్షగానం, దేశ భక్తి గేయాలు, నాటికలు తెలంగాణ గేయాలతో కళాకారులు ఆహుతులను ఉర్రూతలూగించగా, తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని విద్యార్థులు నాటికల రూపంలో కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి అలరింపజేశారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ వేడుక ప్రాధాన్యతను నృత్య రూపకంగా చాటారు. చౌకలింగం బృందం బుర్రకథ వినిపించగా, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం కళాకారులు, అష్ట గంగాధర్, ఆర్టీసి శ్రీనివాస్ నేతృత్వంలోని కళాకారులు తమ ప్రదర్శనలతో ధూంధాం చేశారు.
నంబూరి ప్రసాద్ బృందానికి చెందిన చిందు కళాకారులు ఆకట్టుకునే రీతిలో యక్షగానం ప్రదర్శించగా, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, నగదు పారితోషికం అందించి కళాకారుల పట్ల తన ఉదారత్వం చాటుకున్నారు. అంతరించిపోతున్న యక్షగానం కళను బ్రతికించుకుంటామని, ఈ కళాకారుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కాగా, శివాని డ్యాన్స్ అకాడమీ బృందం వారు మన అమ్మ – తెలంగాణ బతుకమ్మ గేయం పై బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత వివరిస్తూ చూడచక్కని రీతిలో ప్రదర్శన ఇచ్చారు. వర్ని లోని మల్లారెడ్డి మెమోరియల్ స్కూలుకు చెందిన విద్యార్ధిని విద్యార్థులు తెలంగాణ యోధుడు కొమురం భీం పోరాట పటిమ, పౌరుషాన్ని నాటిక రూపంలో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సాంస్కృతిక ప్రదర్శనలను అతిథులు, పెద్ద సంఖ్యలో హాజరైన ఆహుతులు పూర్తిగా లీనమై ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో అంతర్భాగమై 75వ సంవత్సరంలోకి అడుగిడిన శుభతరుణాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోందన్నారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా చేపట్టిన సమైక్యతా ర్యాలీల్లో ప్రతీ సెగ్మెంట్లో సగటున 20 వేల మంది చొప్పున అన్ని వర్గాల వారు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీల్లో భాగస్వాములై జాతీయ భావాన్ని చాటారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల మంది జాతీయ పతాకాలతో ప్రదర్శనలో పాల్గొన్న కార్యక్రమం బహుశా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే అవకాశం ఉండవచ్చని మంత్రి ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈనెల 17, 18వ తేదీలలో కొనసాగిన కార్యక్రమాలు కూడా ఎంతో గొప్పగా జరిగాయని, మనమంతా భారతీయులం తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని ప్రజలు చాటారని మంత్రి వేముల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.
అయితే దురదృష్టవశాత్తు కొంతమంది మత విద్వేషాలతో సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. 65 సంవత్సరాల సమైక్య పాలనలో అణిచివేతకు గురైన తెలంగాణను స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనింపజేస్తూ యావత్ దేశానికే తలమానికంలా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. 2014 నాటికి తెలంగాణలో సగటున తలసరి ఆదాయం లక్షా 26 వేల రూపాయలు ఉండగా, ఎనిమిదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో 2.76 లక్షలకు పెరిగిందని వివరించారు.
విద్యుత్ వినియోగం, సాగు నీరు, ఇంటింటికి రక్షిత మంచినీరు, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనలో తెలంగాణ ప్రాంతమంతా అభివృద్ధిని సంతరించుకుంటోందని పేర్కొన్నారు.
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సమాజంతో కళలకు విడదీయరాని బంధం ఉందని, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో కళలు మమేకం అయి ఉన్నాయని అన్నారు. దీనిని గుర్తెరిగిన ప్రభుత్వం ఇటీవలే నిర్వహించుకున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో, ప్రస్తుతం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లోనూ కవులు, కళాకారులకు గుర్తింపు దక్కేలా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో గడిచిన మూడు రోజుల నుండి చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ స్థాయిలో విజయవంతం చేశారని అన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని వర్గాల వారు భాగస్వాములై జాతీయ భావం పెంపొందించారని కలెక్టర్ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు ప్రకటించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన మీదట వ్యవసాయం, పరిశ్రమలు, ఐ.టీ వంటి అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారేందుకు, మన భవిష్యత్తు తరాలు సకల సంపదలతో తులతూగేలా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమర యోధులు తమ్మి రాములు, ఈశ్వర్ దాస్, రాములును మంత్రి, కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అలాగే, కవులు కళాకారులైన వీపీ.చందన్ రావు, అష్ట గంగాధర్, కోకిల నాగరాజు, కాసర్ల నరేష్, ప్రొఫెసర్ త్రివేణి, ఘనపురం దేవేందర్, శారదా హన్మాండ్లు, ఆర్టీసి శ్రీనివాస్, మెజీషియన్ రంగనాథ్, ఆరుట్ల శ్రీదేవి తో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులను, కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులందరిని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మెప్మా పీడీ రాములు, ఎస్.ఏ.అలీం తదితరులు పాల్గొన్నారు.