కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి విద్యార్థులేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. వీరికి పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువుకొని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా మారాలని ఆకాంక్షించారు. డాక్టర్లు, లాయర్లుగా, నాయకులుగా, ఉన్నత ఉద్యోగాలు సాధించి రాష్ట్రానికి , దేశానికి సేవలు అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తేనే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బంగారు బాటలు వేస్తారని చెప్పారు.
భవిష్యత్తులో మీ నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం నడిచే వీలుందన్నారు. భూమిలేని గిరిజనులకు ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని చెప్పారు. 10 శాతం రిజర్వేషన్లు వారం రోజుల్లో గిరిజనులకు ఇస్తామని జీవో తీస్తామని ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని ఉద్దేశంతో కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లే తాను స్వీకర్ అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు రాజ్యాంగం ద్వారానే నియమించుకునే వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు సకలజనుల సమ్మె చేశారని తెలిపారు. శాంతియుత మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. కష్టపడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం ద్వారా 8 ఏళ్లలో ఎన్నో ఫలితాలు సాధించామని పేర్కొన్నారు.
మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దళితులకు దళిత బంధు పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గంలో ఉన్న దళితులను ఉన్నత వ్యక్తులుగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారని పేర్కొన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం పొందిన గర్భిణీలకు కేసీఆర్ కిట్టు ద్వారా ఆర్థిక సాయం అందజేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. తెలంగాణ జాతీయ సమైక్యత వారోత్సవాలు ఏడాది పాటు ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. వచ్చే తరానికి తెలంగాణ చరిత్ర తెలవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. జాతీయ సమైక్యత వారోత్సవాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం వల్ల గ్రామీణ కళాకారులు తమ ప్రాచీన కళలను ప్రదర్శించే వీలు కలిగిందని తెలిపారు.
ప్రాచీన కళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అన్ని రకాల కళాకారులు ఈ ప్రదర్శనకు హాజరై తమ నైపుణ్యాలను ప్రదర్శించారని పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోధులు కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా శాసనసభాపతి సన్మానం చేశారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీలు, జెడ్పిటిసి సభ్యులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.