నిజామాబాద్, సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్ళపై దృష్టి కేంద్రీకరించాలి
ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. వంట గది, డైనింగ్ హాల్ పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.
పాఠశాలలు, వసతి గృహాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఎక్కడైనా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉంటే తక్షణమే తొలగించాలని సూచించారు. ఈ విషయాలను ఎంతమాత్రం తేలికగా తీసుకోకుండా, హాస్టళ్లు, రెసిడెన్షియల్ బడుల నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తూ, నిరంతరం పర్యవేక్షణ జరపాలని హితవు పలికారు.
నిర్వహణా లోపాలతో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు.