నిజామాబాద్, సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ ప్యాకర్లకు, నెలసరి జీతాల ఉద్యోగులకు, బీడీ కమిషన్ దారులకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం ప్రకారం జీవన భృతిని ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా చేసి, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమం అనంతరం 2014 సంవత్సరంలో శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోర్తాడ్ బహిరంగ సభలో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత (ప్రస్తుత సీఎం) కల్వకుంట్ల చంద్రశేఖర్ పనిచేస్తున్న బీడీ కార్మికులందరికీ, రాజీనామాలు చేసి పెన్షన్ తీసుకుంటున్న బీడీ కార్మికులకు జీవన భృతిని ఇచ్చి ఆదుకుంటానని సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అది కూడా అందరికీ ఇవ్వకపోవడంతో రానివారు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మిగతా కేటగిరీల వారికి అంటే బీడీ ప్యాకర్లకు ,నెలసరి ఉద్యోగులకు, బీడీ కమిషన్ దారులకు అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. 2018 లో జరిగిన ఎన్నికల సందర్భంగా జన్నేపల్లిలో జిల్లాలోని కమిషన్ దారులు అందరికీ సమావేశపరిచి మేకలతో దావతు ఇచ్చి కమీషన్ దారులు అందరికీ కూడా జీవనభృతిని ఇస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఇవ్వకపోవడం కమిషన్ దారులను మోసం చేయడమేనని అన్నారు.
ఇప్పటికైనా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల అందరితోపాటు బీడీ ప్యాకర్లకు,నెలసరి ఉద్యోగులకు, బీడీ కమిషన్ దారులు అందరికీ సీఎం ఇచ్చిన హామీ ప్రకారం జీవన భృతిని ఇవ్వాలని లేనియెడన్న భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు డి రాజేశ్వర్ అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఎం. మత్తన్న, జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్, డి. కిషన్,ఆర్.రమేష్, సాయి రెడ్డి, మరియు బీడీ కమిషన్ దారులు డి. ఆనంద్, టి. నరసయ్య, ఎస్పీ. నారాయణ, ఎస్పీ.లింబాద్రి, పండరి, నారాయణ, గంగా కిషన్, లక్ష్మణ్, అశోక్, రాజేందర్, నరసయ్య, సత్యనారాయణ, ప్రకాష్, సిహెచ్ యాదగిరి గౌడ్, జిల్లాలోని వివిధ సెంటర్ల ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు, కమీషన్ దారులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.