అవసరం లేకపోయినా సిజీరియన్లు చేస్తే దోషులుగా నిలబెడతాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గల అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో గత ఆగస్టు మాసంలో జరిగిన కాన్పుల వివరాలను సమగ్ర పరిశీలనతో సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో లెక్కకు మించి జరుగుతున్న సీజీరియన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా కలెక్టర్‌ గత కొన్ని నెలల నుండి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం విదితమే.

ఇందులో భాగంగానే ఆయా ఆసుపత్రుల్లో జరిగిన సీజీరియన్‌ ప్రసవాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలుగా జిల్లా అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రత్యేక పరిశీలక బృందాల అధికారులతో కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఇదివరకటితో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. స్థానికంగా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున 55శాతం సిజీరియన్లు జరుగుతుంటే, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ లో ఏకంగా 88 శాతం సిజీరియన్లు జరుగుతుండడం ఒకింత ఆందోళన కలిగించే పరిణామంగా మారిందన్నారు. ఇది మహిళా సమాజానికి, వారి ఆరోగ్యాలకు ఎంతో చేటు చేస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గడిచిన ఆగస్టు నెలలో ఆయా ఆసుపత్రుల్లో జరిగిన అన్ని ప్రసవాల వివరాలను నిశితంగా పరిశీలన జరపాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

సిజీరియన్లు జరిగితే అందుకు గల కారణాలను పరిశీలించాలని, ప్రత్యేకించి మొదటి కాన్పులోనే సీజీరియన్‌ అయిన కేసులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. సమగ్ర పరిశీలన జరిపి అన్ని వివరాలతో వారం రోజుల్లోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మహిళల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న అంశమైనందున, పరిశీలక బృందాల అధికారులు అంకిత భావం, చిత్తశుద్ధితో తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ ఉద్బోధించారు.

అవసరం లేకపోయినా సిజీరియన్లు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులైన వారిని ప్రజల్లో దోషులుగా నిలబెడతామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమగ్ర పరిశీలన జరుపుతూ నిబంధనలను అతిక్రమించే ఆస్పత్రులపై చర్యలు చేపట్టాలని, అధికారులకు పూర్తి మద్దతుగా ఉంటామని కలెక్టర్‌ భరోసా కల్పించారు. సమీక్షా సమావేశంలో వైద్యారోగ్య శాఖ పీ.ఓ డాక్టర్‌ అంజన, పరిశీలక బృందాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »