ప్రసవాలకు ప్రైవేటుకు వెళ్తే విచారణ జరపాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలివెళ్తే, ఈ తరహా ఉదంతాలపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా పలువురు ఏ.ఎన్‌.ఎం లు మాట్లాడుతూ, తాము గర్భిణీలను ప్రసవాల కోసం ఫ్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే, వారికి సరిగా వైద్యసేవలందించని కారణంగా గర్భిణీలు అసంతృప్తితో కాన్పు జరగకముందే ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌ లకు వెళ్తున్నారని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ విషయమై కలెక్టర్‌ స్పందిస్తూ, ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణీలు అర్ధాంతరంగా ప్రైవేట్‌ హాస్పిటల్‌ కు వెళ్ళిపోతే అందుకు గల కారణాలను సమగ్ర విచారణ ద్వారా నిగ్గు తేల్చాలన్నారు.

ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్‌కు వెళ్లినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఇందుకు బాధ్యులైన వైద్యులకు రూ. ఐదు వేల చొప్పున జరిమానా వేయాలని సూపరింటెండెంట్లకు సూచించారు. స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వెల్లడైతే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సంతృప్తికరంగా వైద్యసేవలు అందాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా గర్భిణీల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వారికి మరింత మెరుగైన సేవలందేలా చూడాలన్నారు. దీనివల్ల అనవసర సిజీరియన్‌ బారి నుండి వారిని కాపాడినట్లు అవుతుందని, ఫ్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లోనూ నమ్మకం పెంపొందించిన వారవుతారని పేర్కొన్నారు.

ఫ్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచేందుకు క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సి వైద్యులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని హితవు పలికారు. అదే సమయంలో వారి ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల కోసం చేరిన గరీబీనీలకు సంతృప్తికరంగా సేవలందించే బాధ్యత గైనిక్‌ వైద్యాధికారులు, ఆసుపత్రికి చెందిన సిబ్బందిపై ఎంతైనా ఉందన్నారు.

అన్ని సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులు, సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నందున ప్రైవేట్‌ కంటే మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ విషయమై పూర్తి పర్యవేక్షణ జరుపుతూ సంపూర్ణమైన అజమాయిషీ కలిగి ఉండాలని కలెక్టర్‌ సూపెరింటెండెంట్లకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. గర్భిణీలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి హితవు పలికారు.

ప్రసవాల కోసం గర్భిణీలను ఆశాలు, ఏ.ఎన్‌.ఎంలు ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వారిని లేబర్‌ రూమ్‌ వద్దకు అనుమతించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన ప్రసవాలపై ప్రత్యేక బృందాలచే సమగ్ర పరిశీలన జరిపిస్తున్నామని, ఈ సందర్భంగా ఎవరైనా అనవసర సిజీరియన్లు చేసినట్లు, ఇతరాత్ర తప్పిదాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్‌ స్పష్టం చేశారు.

వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అంజనా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌, జిల్లా ఇమ్యూనైజెషన్‌ అధికారి అశోక్‌, ఇంచార్జి డీడబ్ల్యుఓ సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »