డేగ కన్నులతో అడవిని పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరు భావించేలా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలన్నారు.

పోడు భూముల సమస్యలపై మంత్రి వేముల నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో వేర్వేరుగా బుధవారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తూ చేపట్టాల్సిన చర్యల గురించి, అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.

ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న పేదవారికి ఆఖరి అవకాశంగా ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే, ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అటవీ ప్రాంతంలోని ఏ ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురికాకుండా అడుగడుగునా బీట్‌ స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే బీట్‌ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నిరంతరం డేగ కన్నుతో నిఘాను కొనసాగించాలని ఆదేశించారు.

అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టును నరికినా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయమై ఇకనుండి భవిష్యత్తులో తమ తమ గ్రామాల్లోని అడవిని, అటవీ భూముల్ని కాపాడుకోవడానికి అంకితభావం, చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయా ఫారెస్ట్‌ రేంజ్‌ల వారీగా అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్‌ బీటలు, సిబ్బంది సంఖ్యా తదితర వివరాలను మంత్రి ఆరా తీస్తూ, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేయాలని నిజామాబాద్‌ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనాకు మరియు కామారెడ్డి అటవీ శాఖ అధికారి నిఖిత కు సూచించారు.

హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 శాతం అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. మరో మూడు శాతం కలుపుకుని మొత్తంగా తొమ్మిది శాతం వరకు అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోగలిగితే వర్షాభావ పరిస్థితులను నివారించుకుని సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హితవు పలికారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు, గ్రామ, డివిజనల్‌, జిల్లా స్థాయిలలో కమిటీల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తులు గురించి కలెక్టర్‌ మంత్రి దృష్టికి తెచ్చారు.

నిజామాబాద్‌, కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం స్టేట్‌ ఛాంబర్లో వేరు వేరుగా జరిగిన సమీక్షా సమావేశంలో విప్‌ గంప గోవర్ధన్‌, శాసన మండలి సభ్యులు వీ.గంగాధర్‌ గౌడ్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే షిండే, కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్‌ వి పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ముజీబ్‌, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, చంద్ర మోహన్‌, డీటీడీపీవో జయసుధ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏ.డీ శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, అటవీశాఖ డీఎఫ్‌ఓలు, రేంజ్‌ అధికారులు, డీఎల్‌పీఓలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »