కామారెడ్డి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 నుంచి బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాస్థాయి, మునిసిపల్, మండల స్థాయిలో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో విద్యుత్తు లైట్లు అమర్చాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని కోరారు. ఈనెల 26న కలెక్టరేట్ వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
27 న వైద్య సిబ్బంది, 28న విద్యార్థులతో, 29న మెప్మా సిబ్బందితో, 30న కలెక్టరేట్ ఉద్యోగులతో, 1న మున్సిపల్ ఉద్యోగులతో, 2 న డిఆర్డిఏ ఐకెపి ఉద్యోగులతో సంబరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డిఆర్‌డిఓ సాయన్న, డీఈవో రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.