నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల హక్కుల రక్షణ కోసం ఏఐటిసి ప్రారంభం నుండి దేశంలో కార్మిక ఉద్యమాలు చేపడుతూనే ఉందని, అదే స్ఫూర్తి, అనుభవంతో కార్మికుల ఉద్యమం ద్వారానే సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిందేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాలరాజు పిలుపునిచ్చారు. గురువారం ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభలు గడ్డం వెంకట్ రెడ్డి నగర్ (మేరూభవన్) నిజామాబాద్ లో పి. నర్సింగరావు, రాజన్న, హైమది అధ్యక్షతన జరిగింది.
జిల్లా మహాసభ ప్రారంభం ముందుగా కామ్రేడ్ గడ్డం. వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. గత మహాసభ నుండి ప్రస్తుత మహాసభ వరకు అమరులైన కామ్రేడ్స్‌ను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఎస్. బాలరాజు మాట్లాడుతూ 1920 సంవత్సరం బొంబాయి నగరంలో ఏర్పడ్డ సంఘం భారత దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని, నాటి నుండి నేటి వరకు కార్మిక సమస్యల కోసం రాజీలేని పోరాటాల నిర్వహిస్తున్నామని అన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం సిగ్గు చేటని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఉద్యోగాల ఊసే మాట్లాడకపోవడం ప్రధాని మోడీకే దక్కిందన్నారు. ఉన్నటువంటి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఆదాని, అంబానీలకు ఊడిగం చేస్తూ వేల కోట్లాది రూపాయల రుణమాఫీ చేస్తున్నారని, కరోనా సమయంలో ప్రజలకు కార్మికులకు పట్టించుకోకుండా పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి అందర్నీ పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చి ఇప్పటికీ అమలు చేయకపోవడం సోచనియమని బాలరాజ్ శోచనీయమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్లు ఇతర ప్రజాప్రతినిధులు వారికి ఉన్నటువంటి వాటికంటే 200 శాతం వేతనాలు పెంచుకున్నప్పటికీ కార్మికుల కడుపు నింపే పద్ధతిలో వేతనాలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కనీసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు అమలు చేసిన పాపాన లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, లేనిచో ఏఐటియుసి కార్మిక పోరాటాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ విలాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మహాసభ ఉద్దేశించి మాట్లాడారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు రాజేశ్వర్, ఏ. విటల్ గౌడ్, ముత్యాలు, రఫిక్ ఖాన్, ఏఐటియుసి సీనియర్ నాయకులు యాదగిరి, నాయకులు అనిల్, దేవేందర్, ఆనందం, గంగాధర్, రఘురాం, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.