నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక అవార్డులను 2021 సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి కీలకమైన విభాగాల్లో రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న జిల్లాగా నిజామాబాద్ ప్రత్యేకతను చాటుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పల్లెప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన పనుల ద్వారా మన జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ జాతీయ స్ధాయిలో మూడవ ర్యాంక్, సౌత్ జోన్ లో రెండవ ర్యాంక్ రావడం జరిగింది. త్రాగునీరు, పారిశుద్ధ్య కేంద్ర మంత్రిత్వ శాఖ, జల్ శక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడిన ర్యాంకింగులలో ఓవరాల్ ఉత్తమ జిల్లా కేటగిరీలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకులో నిలిచిన నిజామాబాద్‌కు అవార్డు దక్కగా, జోన్ల వారీగా ఎంపిక చేసిన విభాగంలోనూ నిజామాబాద్ జిల్లా సౌత్ జోన్ విభాగంలో 2వ ర్యాంకులో నిలిచి అవార్డుకు ఎంపికైంది.
ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుండి అధికారికంగా గురువారం సమాచారం అందించారు. స్వచ్ఛ దివస్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన ఢల్లీిలో నిర్వహించనున్న కార్యక్రమం సందర్భంగా జిల్లాకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. కీలక విభాగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు జిల్లాకు దక్కడం పట్ల కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల పరస్పర సమన్వయం, సమిష్టి కృషికి ప్రజల సహకారం తోడవడం వల్లే జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కిందని అన్నారు. ఇకముందు కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, స్వచ్ఛ సర్వేక్షన్ లో నిజామాబాద్ జిల్లాను మరింత ముందంజలో నిలుపుదామని కలెక్టర్ పిలుపునిచ్చారు.