నిజామాబాద్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిర్వహించబోయే నిజామాబాద్ పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. గుజ్జెటి వెంకట నర్సయ్య, పెంట దత్తాత్రి, ఎస్‌ఆర్ సత్యపాల్ ఆధ్వర్యంలో మూడు ఫ్యానళ్లు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ప్రచారానికి తెరపడిరది.
రాజకీయ ఎన్నికల్లో మాదిరిగా మద్యం పంపిణీ, బుజ్జగింపులు, హామీలు, కార్యకర్తల సమూహ సమావేశాలు ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ప్రచారంలో గతంలో సంఘం కోసం చేసిన భూ కొనుగోలులో అవినీతి, రెండేళ్ల కోసం న్యాయ బద్దంగా ఎన్నికలు నిర్వహించక పోవడం లాంటి అంశాలను ఓటర్ల ముందుకు తెచ్చారు. గతంలో పని చేసిన వారు కేవలం సంఘ కుటుంబ సభ్యులను రాజకీయ నాయకుల వద్ద చూపుతూ తమ స్వలాభం కోసం చూసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కాగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు సహాయ కార్యదర్శుల పదవులకు ఎన్నికలు జరుగుతుండగా నగరంలోని 63 (తర్పల్లో) సంఘాల్లో 4,696 మంది సభ్యులు ఓటుహక్కును ఆదివారం వినియోగించుకోనున్నారు.