కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సమగ్ర సమాచారాన్ని మైకామారెడ్డి.కం యాప్ ద్వారా పొందవచ్చునని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న చింతల బాలరాజు గౌడ్ స్మారక సమావేశ మందిరం (ఆడిటోరియం)లో శనివారం కేక్ కట్‌చేసి మై కామారెడ్డి. కం లోకల్ యాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కామారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ రహిల్ బృందం సభ్యులు యాప్‌ను రూపొందించారని తెలిపారు. హైదరాబాదులో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బృందం సభ్యులు ఈ యాప్‌ను రూపొందించారని చెప్పారు. ఈ యాప్ ద్వారా కూలీల వివరాలు, రైల్వే, బస్సుల సమాచారం, గ్యాస్ సమాచారం, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వివరాలు, ఎలక్ట్రానిక్స్ షాపులు, సూపర్ మార్కెట్లు, ప్రైవేటు ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, రియల్ ఎస్టేట్ వివరాలు, బ్యాంకులు, ఐఎఫ్‌ఎస్సి కోడ్ వివరాలు పొందవచ్చని పేర్కొన్నారు.
కోవిడ్ తర్వాత ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ వ్యాపార కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. ఈ యాప్ ద్వారా కామారెడ్డి జిల్లా ప్రజలు సకల సౌకర్యాలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో యాప్ నిర్వాహకుడు రహిల్, ప్రతినిధులు పాల్గొన్నారు.