నందిపేట్, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ, పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయంగా ఆశ్రమం కృషి చేస్తున్నదని నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ పేర్కొన్నారు. ఆశ్రమ సభ్యులతో కలిసి శనివారం ఆశ్రమ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులపై వివరణ ఇచ్చారు.
తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈశ్వరుని కృపా కటాక్షంతో గత 37 సంవత్సరాలుగా ఆశ్రమంలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన పలుగుట్టపై పూర్వకాలం నుంచి పలువురు రైతులకు పట్టా ఉండడంతో వారంతా ఇట్టి భూమిని ఇతరులకు అమ్మేందకు సిద్ధమవటంతో భక్తుల సూచన, సహకారంతో భూమిని కొనుగోలు చేశామని తెలిపారు.
ెమొరం గుత్తేదారులు కొంటే గుట్టను తొలగించే ప్రమాదం ఉంటుందనే ముందుచూపుతో ఆశ్రమం కొనుగోలు చేసిందని తెలిపారు. ప్రస్తుతం గుట్టపైన ఉన్న కొన్ని పిచ్చి మొక్కలను మాత్రమే తొలగిస్తున్నామని, ఎలాంటి పెద్ద వృక్షాలు నరకలేదని, పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహలను నమ్మవద్దని కోరారు.
వ్యాపారం చేసేందుకు భూమిని కొనుగోలు చేయలేదని పలుగుట్టను కాపాడేందుకే కొనుగోలు చేశామన్నారు. ఇట్టి భూమిలో గంధం చెట్లు, వివిధ రకాల ఆయుర్వేదా మందుల మొక్కలు నాటడమే కాకుండ గోవుల మేత కొరకు భూమిని ఉంచి ఆశ్రమాన్ని మరింత ఆహ్లాదకరంగా అభివృద్ధి పరుస్తామని చెప్పారు. సమావేశంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మచర్ల సాగర్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ఆశ్రమ కమిటీ సభ్యులు బంగారు సాయిరెడ్డి, బుక నారాయణ, అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి, రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.