నిజామాబాద్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వినాయక్ నగర్‌లో ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ప్రగతి భవన్‌లో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడుకుని ఉన్న 1940 దశకంలోనే చాకలి ఐలమ్మ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారని కలెక్టర్ గుర్తు చేశారు.
మహిళ అయి ఉండి కూడా తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటారని కొనియాడారు. దున్నే వానిదే భూమి – పండిరచిన వారిదే పంట అని నినదించి అణగారిన వర్గాల్లో పోరాట స్ఫూర్తి రగిలించిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని ప్రశంసించారు. అనేక కట్టుబాట్లతో కూడిన నాటి సమాజంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు పరాక్రమానికి పరాకాష్ట అని కలెక్టర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయా కుల సంఘాల ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తన పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తానని అన్నారు. తాను అట్టడుగు స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చానని, పేదల కష్టం ఏమిటో తనకు బాగా తెలుసని కలెక్టర్ తెలిపారు. తన వల్ల ఏ ఒక్కరికైనా మేలు జరుగుతుందంటే వంద అడుగులు ముందుంటానని స్పష్టం చేశారు.
పై స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన సమస్యలను తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, వీడీసీల పెత్తన్నం ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకమని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవస్థను చేతుల్లోకి తీసుకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వీ.డీ.సీల ఆగడాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు చేయించానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పీ నారాయణ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, బీ.సీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, బంగారు సాయిలు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.