నిజామాబాద్, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాల్టా చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇందులో భాగంగానే అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిని సీజ్ చేయాలని, అనుమతి లేని ఆర్.ఓ ప్లాంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
మున్సిపల్ పట్టణాల్లో కమిషనర్లు, మండల, గ్రామ స్థాయిలలో తహసీల్దార్లు వాల్టా చట్టం నిబంధనలను అనుసరిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా బోరుబావులు తవ్వించేవారు తప్పనిసరిగా సంబంధిత శాఖలకు ముందుగానే దరఖాస్తులు చేసుకుని అనుమతి తీసుకునేలా చూడాలని, రిగ్గు వాహనాలు కలిగిన వారు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేనిపక్షంలో వాటిని కూడా సీజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ సంబరాలను ఆయా శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని, బతుకమ్మ చీరాల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.