నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం అని జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి కొనియాడారు. ఆయన ఆశలు, ఆశయాల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, బీసీ, పద్మశాలి కుల సంఘాల బాధ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు వినాయక్ నగర్లో గల ఆయన విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడతాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ, తన తుది శ్వాస వరకు కూడా లక్ష్య సాధనకై అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడని ప్రశంసించారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా మలిదశ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదారని పేర్కొన్నారు.
ఏకధాటిగా ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని రీతిలో ఉద్యమించిన ఘనత ఆచార్య లక్ష్మణ్ బాపూజీకే దక్కుతుందన్నారు. ఆ మహనీయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుందని, అందుకే ఆయన తెలంగాణ సమాజంలో జన్మించిన ఆణిముత్యం అని కలెక్టర్ అభివర్ణించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు, పోరాట పటిమను గుర్తెరిగిన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు.
ప్రభుత్వపరంగా వేడుకలు నిర్వహించడం వల్ల మహనీయుల జీవితాల గురించి, వారు సమాజానికి అందించిన అనిర్వచనీయ సేవల గురించి మనకు, మన భావితరాలకు తెలిసేందుకు ఆస్కారం ఉంటుందని, తద్వారా అనేకమంది స్ఫూర్తి పొందుతారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణా నిర్మాణం కోసం అన్ని వర్గాల వారు ఐకమత్యంతో పాటుపడాలని కోరారు.
బీసీ, పద్మశాలి కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా స్థాయిలో ఉన్నవాటిని పరిష్కరించేందుకు చొరవ చూపుతానని, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన వాటిని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులకు భరోసా కల్పించారు.
నగర మేయర్ దండు నీతూకిరణ్ మాట్లాడుతూ, స్వచ్ఛమైన, నిఖార్సైన తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడమే జీవిత లక్ష్యంగా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ, ఆచార్య జయశంకర్ త్రిమూర్తుల తరహాలో అవిశ్రాంతంగా కృషి చేశారని వారి సేవలను వేనోళ్ళ పొగిడారు. మహానీయులను సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలు, చేతి వృత్తుల వారికి తగిన ప్రాధాన్యతనిస్తూ అందరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు.
లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ వంటి మహానీయులను ముఖ్యమంత్రి కేసీఆర్ తన గురువులుగా కొలుస్తూ, వారు సూచించిన మార్గంలోనే మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించి అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేశారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పారని, యూనివర్సిటీకి ఆయన పేరును నామకరణం చేశారని గుర్తు చేశారు. ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలనే కృత నిశ్చయంతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారి అభ్యున్నతికి దశల వారీగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కోవలోనే చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోందన్నారు. దీనివల్ల చేనేత కార్మికులకు ఎంతోకొంత ఊతం అందుతోందని మేయర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలువాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, ఎస్సీ సంఘం నాయకుడు బంగారు సాయిలు, పద్మశాలి, బీసీ కుల సంఘాల నాయకులు నరాల సుధాకర్, వెంకట నర్సయ్య, ఎనుగందుల మురళి, వినోద్ కుమార్, పులగం హనుమాండ్లు, రాజేశ్వర్, యెండల ప్రదీప్, శ్రీనివాస్ గౌడ్, గంగాకిషన్ తదితరులు పాల్గొన్నారు.