నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు.
రైతులు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి కొప్పులకు వేముల పరిచయం చేశారు. ఈ సందర్బంగా ఇరువురు మంత్రులు మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఇరువురు మంత్రులు కలిసి జుక్కల్ నియోజకవర్గ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యలో వేల్పూర్ ఎక్స్ రోడ్‌లోని రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో కలిసి ఉద్యమంలో కలిసి పనిచేసిన రోజులు ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేసుకున్నారు.
నిజామాబాద్ ప్రాంత రైతాంగం సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారని ఆయన సేవలు స్మరించుకున్నారు. రైతు సమస్యల పట్ల ఆయనకు సంపూర్ణ అవగాహన ఉండేదన్నారు. ఉద్యమ నేత కేసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా స్వర్గీయ సురేందర్ రెడ్డి సేవలందించారు అని గుర్తు చేసుకున్నారు. తండ్రి చూపిన బాటలోనే ఈ ప్రాంత రైతాంగం కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్విరామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.