దళిత బంధు యూనిట్లను అందజేసిన మంత్రులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకంలో ప్రత్యేక పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికైన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 140 మంది లబ్ధిదారులకు దళిత బందు యూనిట్లను అందజేశారు. అనంతరం దళిత బంధు స్కీం యూనిట్ల పర్యవేక్షణపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ప్రతి దళితుల్ని పేదరికం నుండి అభివృద్ధిలోకి తీసుకువచ్చే గొప్ప సృజనాత్మక కార్యక్రమం దళితబంధు కార్యక్రమం అని, ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అందించే యూనిట్లతో గరిష్ఠంగా లబ్ధి పొందేలా యూనిట్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌లదేనని, ట్రాక్టర్లు, కార్లు ప్రస్తుత కాలంలో ఆశించినంత ఉపాధిని చూపించ లేక పోతున్నాయని, వాటికి బదులుగా గరిష్ట ఆదాయాన్ని ఆర్జించి యూనిట్లను ఎంపిక చేయాలన్నారు.

లోకల్‌ జాతుల కన్నా ముర్రా జాతి పశువులు అధికంగా పాల దిగుబడి ఇస్తాయని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అలాంటి జాతులను ఎంపిక చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. లంపిస్కిన్‌ వ్యాధితో బాధపడే పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఎంపికచేసి రాష్ట్రానికి తీసుకురావద్దన్నారు. నిజాంసాగర్‌ మండలానికి చెందిన ఇతర ప్రాంతంలో ఉన్న దళితులను వారికి మరియు మండలానికి చెందిన స్థానిక ఉద్యోగులైన దళితులను గుర్తించి త్వరలోనే వారికి కూడా దళిత బంధు స్కీం వర్తింపచేస్తామన్నారు.

పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామ పంచాయతీ పరిధిలో దళిత బంధు స్కీం పొందిన దళితుల వివరాలను సేకరించి వారు ఆయా యూనిట్ల ద్వారా పొందుతున్న లబ్ధి వివరాలను సేకరించి ప్రతి నెల జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించాలని, దళిత బంధు పథకం ద్వారా వివిధ వాహనాలు, మిషన్లను పొందిన లబ్ధిదారులకు ఎన్‌ఏసి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు సహచర మంత్రి వర్యులు ప్రశాంత్‌ రెడ్డి ముందుకు వచ్చినందుకు దళితుల అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని దళిత లబ్ధిదారులు అందరు సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రివర్యులు అధికారులను ఆదేశించారు.

మంత్రివర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం ద్వారా వాహనాలు మరియు ఇతర యంత్రాలను పొందిన దళిత కుటుంబాలు వాటిని నడిపేందుకు ఇతరులను జీతానికి పెట్టుకొని ఆర్థికంగా నష్ట పోకుండా ఆయా కుటుంబసభ్యుల్లో ఒకరికి వాటిని నడిపించడం పై ఎన్‌ఏసి ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.

ఈ కార్యక్రమం నిజాంసాగర్‌ మండలం నుండే ప్రారంభిస్తున్నామని, ఈ పథకం ద్వారా పొందిన ఒక్క యూనిట్‌ కూడా దుర్వినియోగానికి గురికాకూడదని, ఆయా శాఖల అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పర్యవేక్షించని అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే, జడ్పీ చైర్పర్సన్‌ దపేదర్‌ శోభరాజు, డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ సెక్రెటరీ విజయ్‌ కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఈడి ఎస్సి కార్పొరేషన్‌ దయానంద్‌, రవాణా, వ్యవసాయశాఖ, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »