కామారెడ్డి, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం వీఆర్వోలకు ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేక అధికారులు (వీఆర్వోలు) కీలక పాత్ర పోషించాలని సూచించారు. లేఅవుట్, బిల్డింగ్ అనుమతులను తీసుకునే విధంగా పట్టణ వాసులకు అవగాహన కల్పించాలని కోరారు. మున్సిపల్ లో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో చొరవ చూపాలని కోరారు.
మున్సిపల్ చట్టం ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా చూడాలన్నారు. అన్ని ప్రాంతాల్లో తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వార్డుల వారీగా వీఆర్వోలను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.