నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు నగర అర్సపల్లి శివారులోని తమ భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్ తనయుడు మున్నావర్‌పై చర్య తీసుకొని భూమిని మాకు ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, సిపికి ఫిర్యాదు చేసినా ఎవరు స్పందించడం లేదని తెలిపారు. కోర్టు ఆదేశాలతో పాటు కోర్టు నుంచి పోలీసు బందోబస్తు తీసుకున్నప్పటికీ కూడా తమ భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని, దంపతులు తమ గోడు వెళ్ళబోసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ నగరంలోని అశోక్ నగర్‌కు చెందిన బాధిత దంపతులు ఆయేషా ఫాతిమ, షేక్ మజర్‌లు నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో అర్సపల్లి ప్రాంతంలో గల 214 సర్వే నంబర్‌లో 22 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేశామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి పత్రాలు తమ వద్ద ఉన్నాయని, ఆ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ తనయుడు మున్నవర్ అలీ, షాహీద్‌లు మరి కొంతమంది కలిసి తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.
దీనికి సంబంధించిన పూర్తి సర్వే నివేదిక కూడా తమ వద్ద ఉందన్నారు. అధికారుల అండదండలతో సదరు వ్యక్తులు తమ భూమిని యదేచ్చగా కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు. కోర్టు తీర్పు వచ్చినా ఖాతర్ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతూ కబ్జా చేసిన స్థలాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చారని వారు విమర్శించారు. తమ పలుకుబడితో భూమిని కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.