నిజామాబాద్, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ జెడ్పి సీఈఓ గోవింద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుండి మొత్తం 56 వినతులు వచ్చాయి.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యల గురించి అర్జీదారులకు సమాచారం తెలియజేస్తూ, ఆన్ లైన్ సైట్ లోనూ వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. పెండిరగ్ ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.
ప్రతి శాఖకు సంబంధించిన కార్యాలయం, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సమీకృత కార్యాలయాల సముదాయంలో విధులు నిర్వర్తించే వారందరికీ పాసులు అందించేలా చర్యలు తీసుకుంటున్నందున, కింది స్థాయి సిబ్బంది మొదలుకుని జిల్లా ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరి వివరాలను శాఖల వారీగా సమర్పించాలని అన్నారు.
పాసులు ఉన్న వారినే లోనికి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కాగా, ఇంకనూ అక్కడక్కడా మిగిలి ఉన్న బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియను శరవేగంగా చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.