ఎడపల్లి, అక్టోబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ క్లస్టర్ ఐసిడిఎస్, ప్రజ్వళ సంస్థ, హైదరాబాద్ వారు సంయుక్తంగా సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో అంగన్‌వాడీ కార్యకర్తలకు మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై రెండు రోజుల పాటు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వళ సంస్థ ట్రైనింగ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ చంద్రయ్య, రఫీ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా హేయమైన చర్య అన్నారు.
ప్రపంచంలో డ్రగ్స్, ఆయుధాల సరఫరా తరువాత మానవ అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తుందన్నారు. స్వలాభం కోసం కొందరు మనుషులను కొనడం, అమ్మడం చేస్తుంటారు, కొందరు అవకాశ వాదులు సినిమాలు, టివిల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెబుతూ ఎక్కువగా మధ్యతరగతి మహిళలను, అమ్మాయిలను ఈ ఊబిలోకి లాగుతారని, మరికొందరు మహిళలు, పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మకానికి పెట్టడం జరుగుతున్నదని చెప్పారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ అదికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి కట్టుగా పనిచేస్తే మనుషుల అక్రమ రవాణాను నివారించవచ్చన్నారు. మనుషుల అక్రమ రవాణా లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉండడం అంధోళన కలిగిస్తుందన్నారు. ఇందులో ఎక్కువగా బాలబాలికలు, మహిళలు ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, సినిమాలో చాన్స్ అనే అవకాశాల పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసి శ్రమ దోపిడీ, అవయవాల మార్పిడి మరియు లైంగిక దోపిడీకి గురిచేయడం జరుగుతుందని కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ప్రజ్వల స్వచ్చంద సంస్థ తెలంగాణాలో అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
అలాగే ఈ సంస్థ తెలంగాణా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ది శాఖ అధికారుల సహాయంతో ఇప్పటి వరకు ఇలా మోసపోయిన 26 వేల మంది అమ్మాయిలను, మహిళలను కాపాడడం జరిగిందని చెప్పారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్‌లో 1996 లో స్థాపిచబడిరదని, సంస్థ స్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సునీత కృష్ణన్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ది శాఖ అధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బోధన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఇన్చార్జి సీడీపీఓ వినోద, సిబ్బంది సంధ్య, సూపర్వైజర్లు, వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.