నిజామాబాద్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపర్చాలని, చెదలు నివారణ కోసం అవసరమైనచోట పెస్ట్ కంట్రోల్ చేయించాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ సంబంధిత పనులను పక్కాగా జరిపించాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.