ఇసుక, మొరం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏ ఒక్క ప్రాంతం నుండి కూడా ఇసుక, మొరం అక్రమ రవాణా జరుగకుండా ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను సైతం గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు చెందాల్సిన పీడీఎస్‌ రైస్‌ ను పక్కదారి పట్టించి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న స్మగ్లర్లపై అవసరమైతే పీ.డీ యాక్ట్‌ నమోదు చేయాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖలతో కలిసి పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, మైనింగ్‌, పౌర సరఫరాల శాఖ ఎన్‌ ఫోర్సుమెంట్‌ విభాగాలకు చెందిన అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు.

సాధారణ శాంతిభద్రతలు, అక్రమ ఇసుక, మొరం రవాణా, టీఎస్‌-బిపాస్‌ సంబంధిత అంశాలపై సమీక్ష జరిపారు. అనుమతులు లేకుండా ఏ ఒక్క వాహనంలోనూ ఇసుక, మొరం రవాణా జరుగకుండా క్షేత్ర స్థాయిలో గట్టి నిఘాను కొనసాగించాలని పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులను ఆదేశించారు. తు.చ తప్పకుండా నిబంధనలను అనుసరిస్తూనే అనుమతులు జారీ చేయాలని, అనుమతుల మంజూరు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు.

అదేవిధంగా పీడీఎస్‌ రైస్‌ స్మగ్లింగ్‌ నిరోధానికి ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయాన్ని పెంపొందించుకుని గట్టిగా కృషి చేయాలన్నారు. పదేపదే రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, అవసరమైతే పీ.డీ యాక్టు పెట్టేందుకు కూడా వెనుకాడవద్దని సూచించారు. సివిల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పోలీస్‌ శాఖ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని, అప్పుడు ఇసుక, మొరం, బియ్యం వంటి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టగల్గుతామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకోవచ్చని సూచించారు. అక్రమ రవాణాను ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించమని, దీనిని అరికట్టడంలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాల విషయంలో ఉదాసీన వైఖరిని విడనాడాలని, నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాకు బాధ్యతలు కేటాయించారు. తాను కూడా పోలీస్‌ కమిషనర్‌ తో కలిసి ప్రతి నెలా సమీక్షిస్తానని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి చేపట్టే చర్యల కోసం అయ్యే వ్యయాన్ని సమకూరుస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఈ మేరకు ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు పది లక్షల రూపాయల చొప్పున నిధులు అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ అక్రమ రవాణా, ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతం, అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు జరిగితే ఉపేక్షించబోమని, సంబంధిత అధికారును బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. సమావేశంలో వివిధ శాఖ అధికారులు, ఆర్దీవోలు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »